ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి.. కానీ ప్రమాదాలు అనేకం : ఉడుముల సుధాకర్ రెడ్డి
బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో కృత్రిమ మేధలో (AI), టూల్స్ & టెక్నిక్స్, వర్క్ షాపు ను తెలంగాణ మీడియా అకాడమీ, అదిరా (ADIRA) డాటా లీడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
By Medi Samrat
బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో కృత్రిమ మేధలో (AI), టూల్స్ & టెక్నిక్స్, వర్క్ షాపు ను తెలంగాణ మీడియా అకాడమీ, అదిరా (ADIRA) డాటా లీడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానల్స్ కు చెందిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలకు సంబంధించిన దాదాపు 100 మందికి పైగా జర్నలిస్టులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో కూడా AIని విరివిగా వాడుతున్నారని అన్నారు. అందులో భాగంగా న్యూస్ రూములు పరివర్తన చెందినందున జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిజంలో భాగంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏఐ ని జర్నలిస్టులు వృత్తిలో భాగంగా ఉపయోగించుకొని రిపోర్టింగ్ లో సులభతరమైన పద్ధతులను పాటించి తక్కువ సమయంలోనే ఎక్కువ అంశాలను పాఠకులకు, వీక్షకులకు అందించవచ్చు అని ఆయన తెలిపారు. AI సాంకేతికత పై లోతైన నైపుణ్యం ఉన్న, ఇంటర్నేషనల్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి శిక్షణ నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో ఏఐ శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. అలాగే మన తెలంగాణలో జర్నలిస్టులకు ఏఐలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటి ప్రయత్నం అని ఆయన అన్నారు.
ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టు కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలన్నారు. అదేవిధంగా తాను కూడా నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగానే కొనసాగుతున్నానని తన వృత్తి జీవితం గురించి వివరించారు. ఏఐ శిక్షణలో భాగంగా ఏఐ టూల్స్ ఉపయోగాలు, ప్రమాదాలు, ఏఐ పద్ధతులు, నియమ నిబంధనలు, ప్రాథమిక అంశాల గురించి విస్తృతంగా వివరించారు. కృత్రిమ మేధ జర్నలిస్టుల వృత్తిలో భాగంగా తప్పనిసరి అయిందని, ఏఐ మనసును భ్రమింప జేసి తప్పుడు సమాచారాన్ని.. వివక్షపూరిత సమాచారాన్ని అందించే ప్రమాదం ఉందన్నారు. తన వద్ద ఉన్న ఉదాహరణల ఆధారంగా ఏఐ అవుట్ పుట్ టూల్స్ కూడా జాతి, మత, వర్గ, లింగ భేదాలు కలిగించే కంటెంట్ ను అందిస్తాయన్నారు.
ఆటోమేషన్ లో భాగంగా ఏఐ ఏజెంట్స్ వస్తున్నాయని, దీని ద్వారా రాబోయే కాలంలో వివిధ రకాల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. చాట్ జిపిటి, పెర్పెక్లిసిటీ, నోట్ బుక్ ఎల్ ఎం, గూగుల్, జమినయి, మిడ్ జర్ని, సోరా, విఇఓ3, తదితర టూల్స్ ని పరిచయం చేసి జర్నలిస్టులు ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉదాహారణల ద్వారా అవగాహన కలిగించారు. AI డాటా ట్రైయినింగ్ లో వినియోగంలో లోపం వల్ల, ప్రామ్టింగ్ ఇంజనీరింగ్ సరిగా చేయకపోవడం వల్ల, ఈ వివక్ష లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చేందుతుంది అన్నారు. AI నైతిక నియమాలు తదితర అంశాలకు లోబడి జర్నలిస్టులు బాధ్యతా యుతంగా కృత్రిమ మేథ పరిజ్ఞానంను ఉపయోగించాలని ఆయన సూచించారు.