చుట్టూ చీకటి.. అడవిలో ఆగిన రైలు.. మహిళకు గుండెపోటు.. పోలీసులు.. ఏమైంది..?
Women Passenger got Heart Attack while Train stopped in forest.వేగంగా దూసుకువెలుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు అడవి మధ్యలో
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2022 8:58 AM ISTవేగంగా దూసుకువెలుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు అడవి మధ్యలో ఒక్కసారిగా ఆగింది. చుట్టూ చిమ్మ చీకటి. ఇంతలో పోలీసులు వచ్చారు. రైలులో తనిఖీలు చేస్తున్నారు. అది చూసి ఓ మహిళా ప్రయాణీకురాలు ఆందోళనకు గురి కావడంతో గుండెపోటు వచ్చింది. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాకు సమీపంలో బాసర నుంచి సికింద్రాబాద్ వెలుతున్న నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది.
నర్సాపూర్- నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు చెందిన సంధ్య అనే మహిళ ప్రయాణం చేస్తోంది. ఆమె షిరిడి వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి వస్తోంది. ఈ రైలులో నల్లబెల్లం అక్రమ రవాణా చేస్తున్నారని ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు రైలులో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నల్లబెల్లం అక్రమ రవాణా దారులు ధర్మాబాద్-బాసర అటవీ ప్రాంతంలో ట్రైన్ చైన్ లాగారు. రైలు ఆగగానే దిగి పారిపోయారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల వద్ద నుంచి 20 బ్యాగుల నిషేధిత బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. తతంగాన్ని చూస్తూ సంధ్య ఆందోళనకు గురైంది. ఆమెకు ఛాతిలో నొప్పి మొదలై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది నిజామాబాద్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు నిజామాబాద్‌కు చేరుకోగానే సంధ్యను అప్పటికే ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జి చేశారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
కొన్ని రోజులుగా నిజామాబాద్ మీదుగా వెళ్లే రైళ్లలో కొందరు అక్రమార్కులు నల్లబెల్లం తరలిస్తున్నారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందుతున్నాయి. ఈ క్రమంలోనే నల్ల బెల్లం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు.