విషాదం.. వేములవాడ ఆలయంలో మహిళా భక్తురాలు మృతి
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం ఓ మహిళా భక్తురాలు మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి
By అంజి Published on 6 Jun 2023 12:45 PM ISTవిషాదం.. వేములవాడ ఆలయంలో మహిళా భక్తురాలు మృతి
రాజన్న-సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో మంగళవారం ఉదయం ఓ మహిళా భక్తురాలు మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనం కోసం లైన్‌లో నిల్చున్న మహిళ క్యూలైన్‌లోనే కుప్పకూలింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం వేములవాడలోని ఇతర ఆలయాలను దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో రాజన్నను దర్శించుకోలేక రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామునే లేచి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న మహిళ ఛాతిలో నొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలింది. అది చూసి కుటుంబసభ్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
గమనించిన ఆలయ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. వేములవాడ ఆలయ సిబ్బంది.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కిష్టయ్య(70) కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అంజన్న దర్శనానికి వచ్చాడు. కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. కొద్దిసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని వాహనంలో ఆయన స్వగ్రామానికి తరలించారు.