మందుబాబులకు షాక్ తగిలింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హుజూరాబాద్ ఉప నేపధ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను గురువారం రాత్రి ఏడు గంటల నుంచి 30వ తేదీ రాత్రి 7 వరకు మూసివేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి 7 గంటల నుంచి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. రేపు పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ ముగిసిన అనంతరం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి.
పోలింగ్ ఏర్పాట్లు పూర్తి..
రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కరోనా సోకిన వారు సైతం పీపీఈ కిట్లు ధరించి సాయంత్రం సమయంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 306 పోలీగ్ స్టేషన్లలో 2 లక్షల 76 వేల 36 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు లక్షా 17వేల 933 మంది, మహిళలు లక్షా 19వేల 102 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 14 వందల 71 మంది ఇతర జిల్లాల పోలీసులతో మొత్తం 3,865 మంది సిబ్బందితో భారీ బందోస్తును ఏర్పాటు చేశారు.