మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా?: కేటీఆర్
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 6 Aug 2024 11:06 AM GMTమెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా?: కేటీఆర్
హైదరాబాద్: మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. జీవో 33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలోని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయన్నారు. 9 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మన వద్ద చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభుత్వం చెబుతోందని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు.
హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు 6 వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించామని వివరించారు.
దాని కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియేట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారు లోకల్ గానే పరిగణించబడే వారని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు. దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా.. గతంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.