తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా: ప్రధాని మోదీ

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

By అంజి  Published on  7 Dec 2023 3:09 PM IST
Revanth Reddy, Telangana government, PM Modi

తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా: ప్రధాని మోదీ

డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సర్కార్‌ నుంచి సాధ్యమైనంత మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ''సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి అభినందనలు.. రాష్ట్రాభివృద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నా'' అని ప్రధాని తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో గాంధీ కుటుంబీకుల సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌంద్రరాజన్ ప్రమాణస్వీకారం, గోప్యత ప్రమాణం చేయించారు. గాంధీ కుటుంబంతో పాటు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డికె శివకుమార్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా, మార్చిలో 100 రోజుల పాదయాత్ర చేసిన మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సి.దామోదర రాజనరసింహ, డి.శ్రీధర్ బాబు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వంలో మార్పు వచ్చింది.

Next Story