నల్లమలలో ఘోరం.. వాహనదారులు చూస్తు పోయారే తప్పా..
Wife and daughter killed in tragic road accident in nallamala forest. నల్లమల్ల ఫారెస్ట్‌లో నేషనల్ హైవేపై ఘోర ప్రమాద ఘటన జరిగింది.
By అంజి
నల్లమల్ల ఫారెస్ట్‌లో నేషనల్ హైవేపై ఘోర ప్రమాద ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూతురిని కాపాడుకునేందుకు ఓ తండ్రి హాహాకారాలు చేశాడు. అయితే ఆ దారిన వెళ్తున్న వారు.. ఆ తండ్రి చూశారే తప్పా.. ఒక్కరు కూడా ఆదుకునేందుకు ముందుకు రాలేదు. ఓ పక్క భార్య మృతి చెంది పక్కన పడి ఉండగా, భర్తకు గాయాలై విలపిస్తున్నా.. దారిన వెళ్లే వాహనదారులు ఎవరూ కనీసం స్పందించలేదు. తీవ్రగాయాలపాలైన పసిపాను ఆస్పత్రిలో చేర్పించాలని మొత్తుకున్నా.. ఎవరూ వినిపించుకోలేదు. చివరకు ఓ కారు యజమాని స్పందించాడు. వారిని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో పసిపాప ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలపాడు జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన జంబులయ్య, మైమ (26). వీరికి ఇద్దరు కూతుర్లు సరిత, సాత్విక (ఏడాదిన్నర) ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుతూరిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడానికి ఆదివారం బైక్‌పై మైమ తల్లిగారి ఊరైన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నల్లగట్టకు బయల్దేరారు. నల్లమల ఫారెస్ట్‌లో ఆత్మకూరు మండలం బైర్లూటి దాటిన తర్వాత ఓ జీపు వారి బైక్‌కు దాటుకుని వేగంగా వెళ్లింది. అదే టైంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు వచ్చింది. దీంతో జీపు వేగం హఠాత్తుగా తగ్గడంతో.. వీరి బైక్ అదుపుతప్పి పడిపోయింది. ప్రమాదంలో తల్లి మైమ అక్కడికక్కడ మృతి చెందింది.
చిన్నారిని సాత్వికకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. కూతురిని కాపాడుకునేందుకు జంబులయ్య ప్రతి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ దారి వెంట వేల వాహనాలు వెళ్తున్నా.. ఎవరూ స్పందించలేదు. చివరకు ఎమ్మిగనూరు వెళ్తున్న శ్రీనివాసరాయుడు తన కారును ఆపి మైమ మృతదేహాన్ని, తండ్రిని, పసిపాపను ఎక్కించుకుని ఆత్మకూరు ఆస్పత్రిలో చేర్చాడు. అప్పటికే సాత్విక మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. కాస్తా ముందే ఆస్పత్రికి చేరుకుని ఉంటే కుమార్తె బతికేదని జంబులయ్య రోదించాడు.