ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమిదే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్‌కు పరాభవం తప్పలేదు.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 5:02 AM GMTఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమిదే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్‌కు పరాభవం తప్పలేదు. ఓటింగ్ తర్వాత వెలువడిన దాదాపు ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ ఫలితాలు వెల్లడి అయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 39 స్థానాలకే పరిమితం అయ్యింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఇందుకోసం పార్టీ అధిష్టానం కూడా చర్చలు జరుపుతోంది. అయితే.. అధికార పార్టీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో ఓడిపోవడానికి గల కారణాలను ఒక సారి చూద్దాం..
ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అందరి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించారు. ఇదే ఆ పార్టీని దెబ్బ తీసిందని చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ విషయం తెలిసినా కూడా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ శాతం మార్చి ఉంటే మాత్రం ఫలితాలు మరోలా వచ్చేవని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు.. విమర్శలు వచ్చినా బీఆర్ఎస్ అధిష్టానం వాటిని లైట్ తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి చాన్స్ ఇచ్చామనీ.. తమదే మరోసారి అధికారం అంటూ గొప్పగా చెప్పుకుంది బీఆర్ఎస్. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట మాత్రం బీఆర్ఎస్‌కు మంచి ఫలితాలే వచ్చాయి. 12 స్థానాల్లో అభ్యర్థులను మార్చగా.. అందులో 9 చోట్ల గెలుపొందింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థులను 12 మందిని మార్చగా.. అక్కడ 9 స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్. మరో మూడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. కామారెడ్డి, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్, అలంపూర్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, నర్సాపూర్, వేములవాడ, ఉప్పల్, కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కేసీఆర్ ఇతరులకు టికెట్ ఇచ్చింది. మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హన్మంతరావుకి టికెట్ ఇచ్చినా.. ఆయన తన కుమారుడికి కూడా టికెట్ కావాలన్న డిమాండ్‌తో పార్టీ మారారు. దాంతో.. మల్కాజ్‌గిరి టికెట్ మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చారు కేసీఆర్. మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే.. అభ్యర్థులన మార్చిన కామారెడ్డి, వేములవాడ, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే ఓటమిపాలు అయ్యింది. కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్థానంలో కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్, ఖానాపూర్‌లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ శాతం మార్చి ఉంటే బీఆర్ఎస్‌కు ఇంకాస్త మెరుగైన ఫలితాలు వచ్చేవని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.