హైదరాబాద్ నెక్ట్స్ పోలీస్ కమిషనర్ ఎవరు..?
హైదరాబాద్ సీపీగా ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
By Srikanth Gundamalla
హైదరాబాద్ నెక్ట్స్ పోలీస్ కమిషనర్ ఎవరు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆ తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాంతో.. పలువురు ప్రభుత్వ అధికారులను బదిలీ వేటు వేసింది. ఎన్నడూ లేని విధంగా ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.
ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని సీఎస్‌ను ఆదేశించింది. బదిలీ అయిన వారివారి స్థానాల్లో కొత్తవారిని నియమించాలని.. రీ స్థానాల్లో ఇతర అధికారుల నియామకం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లతో అవసరమైన జాబితాని పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించి కేంద్ర ఎన్నికల సంఘం. బదిలీ అయిన వారిలో హైదరాబాద్, వరంగల్, నిజమాబాద్ సీపీలతో పాటు పలు జిల్లాల ఎస్పీలు ఉన్నారు. ప్రస్తుతం అదనపు సీపీలకు బాధ్యతలు అప్పగించింది. అయితే.. కీలకంగా ఉన్న హైదరాబాద్ సీపీగా ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మొత్తం 17 మందితో కూడిన అదనపు డీజీ స్థాయి అధికారుల జాబితాను సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వీరిలో ముగ్గురి జాబితాను వేరుగా పంపినట్లు సమాచారం. మిగిలిన కమిషనర్ల పోస్టులకు సీనియర్ ఐపీఎస్‌ల పేర్లను సూచించారు.
తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీనియర్ ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్లను వేరుగా పంపినట్లు తెలిసింది. వీరిలో హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం అదనపు డీజీగా పనిచేస్తున్నారు. ఆయనకు ముక్కుసూటిగా పనిచేసే అధికారిగా పేరుంది. అయితే.. ఈయన కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిపై మొగ్గుచూపితే మాత్రం.. సందీప్ శాండిల్య, సంజయ్‌కుమార్ జైన్‌లలో ఒకరిని హైదరాబాద్ సీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన సీఐడీ విభాగాధిపతిగా ఉన్నారు. అయితే.. మునుగోడు ఎన్నికల సమయంలో రాచకొండ కమిషనర్‌గా ఉండటం.. చౌటుప్పల్ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి రావడం ఆయనకు ఆటంకంగా మారింది.