ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో BRS నుంచి ఎవరికి అవకాశం?

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  5 Jan 2024 3:15 PM IST
BRS, MLC election, telangana,

 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో BRS నుంచి ఎవరికి అవకాశం?

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరుగుతంది. అయితే.. రెండు స్థానాలకు గాను ఒక పదవి కాంగ్రెస్‌కు, మరోటి బీఆర్ఎస్‌ నుంచి ఎంపిక అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ నుంచి కొత్త ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేస్తారనేదానిపై ఆసక్తి కొనసాగుతోంది.

ప్రస్తుతం ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్‌ కోటాలోనే ఉన్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు బలం 39 ఉండగా.. అధికార పార్టీ కాంగ్రెస్‌కు 64 మంది సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన ఇరు పార్టీలకు చెరో సీటు దక్కేందుకు అవకాశాలు క్లియర్‌గా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో ఈ ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో.. ఎవరికి ఈ అవకాశం లభిస్తుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది.

శాసనసభ ఎన్నికల్లో కొందరు నాయకులకు ఆశాభంగం తప్పలేదు. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో వారు రాబోయే రోజుల్లో పార్టీ నుంచి వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి తమ సీటు త్యాగం చేసిన నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు రాజయ్య, గంపా గోవర్ధన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా గవర్నర్ కోటా కింద పేర్లను పంపినప్పటికీ ఆమోదం రాకపోవడంతో నిరాశకు గురైన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. వీరే కాదు ఇంకొందరు నాయకులు కూడా పార్టీ అధిష్టానంతో ఎమ్మెల్సీ పదవి కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అధినాయకత్వం కూడా కసరత్తులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు ఆశావాహులు ఎక్కువగా ఉన్న వేళ.. బీఆర్ఎస్‌ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

కాగా.. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సభ్యులకు గాను.. కాంగ్రెస్‌కు 64 మంది, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎం పార్టీకి 7, సీపీఐ పార్టీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు ఈ నెల 29న జరగనుంది.

Next Story