Telangana: ప్రజాపాలన దరఖాస్తులు సురక్షితమేనా?.. అనుమానాలకు తావిస్తోన్న వీడియో

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్‌లను బాధ్యతారాహిత్యంగా నిర్వహిస్తున్నట్లు చూపుతున్నాయి.

By అంజి  Published on  9 Jan 2024 5:30 AM GMT
Praja Palana, Praja Palana application, Telangana, Telangana government

Telangana: ప్రజాపాలన దరఖాస్తులు సురక్షితమేనా?.. అనుమానాలకు తావిస్తోన్న వీడియో

తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమం కింద ప్రజల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించింది. చివరి తేదీ అయిన జనవరి 6 వరకు 1.25 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇప్పుడు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్‌లను బాధ్యతారాహిత్యంగా నిర్వహిస్తున్నట్లు చూపుతున్నాయి.

ప్రజాపాలన ఫారాలపై బాధ్యతారాహిత్యం

రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్‌ల నిర్వహణపై సందేహాలు రేకెత్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజాపాలన కార్యక్రమం కింద ప్రజలు సమర్పించిన దరఖాస్తులతో కూడిన అట్టపెట్టెను ఒక యువకుడు బైక్‌పై తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలోనే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో బాక్సులోని ఫారాలు బాలానగర్ ఫ్లైఓవర్ పై పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో వివిధ పథకాలకు ఉద్దేశించిన ప్రజాపాలన ఫారమ్‌లను చూసి, ప్రజలు గుమిగూడి వివరాలు అడగడం ప్రారంభించారు. అయితే సరైన సమాచారం అందించడంలో యువకుడు విముఖత చూపించాడు. కాగా, రోడ్డుపై పడ్డ కొన్ని దరఖాస్తులను వాహనదారులు ఏరి తీసుకొచ్చి ఇచ్చినా.. ఇంకా ఎన్ని దరఖాస్తులు గాలికి కొట్టుకుపోయాయో తెలియకపోవడం గమనార్హం.

వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లో జీహెచ్‌ఎంసీ శిక్షణ ఇచ్చిన ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరించాల్సిన ప్రజాపాలన లబ్ధిదారుల వివరాలను ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కంప్యూటరీకరిస్తున్నారని సమాచారం.

నెటిజన్ల స్పందన

ఈ సంఘటన తర్వాత, రాష్ట్రంలో ప్రజాపాలన ఫారమ్‌లను తప్పుగా నిర్వహించడంపై నెటిజన్లు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ లీడర్‌ క్రిశాంక్ ఈ వీడియోను పోస్ట్ చేసి, ఇది తీవ్రమైన డేటా ముప్పు అని ఆరోపించారు. 'ఓటీపీలు అడుగుతూ ప్రజలకు అనామక ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి' అని కూడా ఆయన ప్రశ్నించారు.

మరో నెటిజన్ ఒక కేఫ్‌లో ఉంచిన ప్రజా పాలనా ఫారమ్‌ల ఫోటోను షేర్ చేస్తూ, 'ప్రజా పాలనా దరఖాస్తులా లేదా వ్యర్థ కాగితాలా? ఎవరు జవాబుదారీ?' అంటూ ప్రశ్నించారు.

ప్రజాపాలన కింద మొత్తం తెలంగాణలో 1.25 కోట్ల దరఖాస్తు ఫారాలు సమర్పించబడ్డాయి. వారిలో 13.7 లక్షల మంది ఒక్క హైదరాబాద్‌కు చెందిన వారు. జనవరి 6న కార్యక్రమం ముగిసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తు అప్‌లోడ్ ప్రక్రియను ప్రారంభించి, జనవరి 17 వరకు గడువు విధించింది.

Next Story