కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో సభ్యుల నమోదు కొనసాగుతోంది. కార్డుల డిజైన్లు ఖరారు కాకపోవడంతో వాటి స్థానంలో లబ్ధిదారులకు ప్రస్తుతానికి మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని చెప్పారు. వాటి ద్వారానే రేషన్ ఇస్తామని, సంక్షేమ పథకాలకూ వీటినే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కొత్త కార్డుల డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ప్రింట్ చేసి అర్హులకు ఇవ్వనున్నారు. కాగా ఇప్పటి వరకు 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. గ్రామాల్లో దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు.
ఆగస్టు 10వ తేదీ వరకు రేషన్‌కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ కొనసాగుతుంది. కొత్త కార్డుల డిజైన్లపై ఇంకా ఒక క్లారిటీకి రాకపోవడం, టెండర్ల అంశం కోర్టులో ఉండటంతో ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తోంది. ఈ పత్రాల ఆధారంగానే రేషన్ అందిస్తామని, సంక్షేమ పథకాలకు పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షల చేరగా.. లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. కొత్తకార్డుదారులకు ఇచ్చే మంజూరు పత్రాల ఆధారంగా వారికి సెప్టెంబరు నుంచి రేషన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు.