ఉపఎన్నికపై మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?
What do people think about the by-election.తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపై ఉంది.
By తోట వంశీ కుమార్ Published on 18 Oct 2022 12:51 PM ISTతెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపై ఉంది. మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలు అన్ని కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి తమ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందనే సంకేతాన్ని తీసుకువెళ్లాలని బావిస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడగా.. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఇందులో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉండగా.. ఎక్కువ మంది స్వతంత్య్ర అభ్యర్థులు ఉన్నారు.
ఇప్పటికే వీరంతా ప్రచారాన్ని ప్రారంభించారు. గత పది రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మామూలుగా చిన్న కారు కూడా కనపడని పల్లెల్లో ఇప్పుడు రోజు వందల సంఖ్యలో కొత్త కొత్త మోడళ్ల కార్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సమయంలో వరి, పత్తి కోతల పనులతో తలమునకలయ్యే వ్యవసాయ కూలీలు ప్రస్తుతం ప్రచారంలో నిమగ్నం అయ్యారు.
మునుగోడు నియోజకవర్గం నల్లగొండ, భువనగిరి జిల్లాలోని ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుపల్ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి.
మునుగోడు కొన్ని సార్లు కాంగ్రెస్‌కు జై కొట్టింది. ఇంకొన్ని సార్లు కమ్యూనిస్టులను ఆదరించింది. 2014లో కారు ప్రభంజనంలో గులాబీని అక్కున చేర్చుకుంది. 2018లో మళ్లీ చేయికి చేయూతనందించింది. మరీ ఇప్పుడు ఎవరిని ఆదరిస్తారు..? ఇంతకీ ఉప ఎన్నికపై మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారు..? అని తెలుసుకునేందుకు న్యూస్ మీటర్ బృందం మునుగోడు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది.
ఉప ఎన్నిక రావడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు.?
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది. కొన్ని పరిణామాల తరువాత కాంగ్రెస్‌కు చేయి ఇచ్చి కమలం గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. తాను రాజీనామా చేస్తేనే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని ఎప్పటి నుంచో ఆయన చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా అదే మాట చెప్పారు.
ఉప ఎన్నిక రావడం కూడా ఒకందుకు మంచిదేనని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఒకప్పుడు మునుగోడు అంటే అంతగా ఎవ్వరికి తెలియదనీ.. కానీ ఉప ఎన్నిక మూలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడో ఉన్న తెలుగు వారు కూడా మునుగోడు గురించి తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఒకప్పుడు తమ గ్రామాల వంక కనీసం కన్నెత్తి చూడని నాయకులు ఇప్పుడు తమ నియోజకర్గంలో పర్యటిస్తున్నారన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు వెలుతున్నాయని, అన్నీసమస్యలు తీరకపోయినా కనీసం కొన్నైనా తీరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నిక మూలంగా ఎంతో కొంత మంచి జరుగుతుందని అంటున్నారు.
ఇక.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి భారతీయ జనతాపార్టీ(బీజేపీ)లో చేరడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇది సరైన నిర్ణయమే అని అంటుండగా.. మరికొందరు మాత్రం కాదని అంటున్నారు. పార్టీ మారితే అభివృద్ధి జరగదని అంటున్నారు. అయితే.. యువతలో ఎక్కువ మంది చాలా మంది రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదేనని అంటున్నారు. అన్నీ పార్టీల నాయకులు ప్రస్తుతం మునుగోడు వైపు చూస్తుండడానికి కారణం రాజగోపాల్ రెడ్డి రాజీనామానేనని చెబుతున్నారు.
ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీలు మారారు. ఇలా నేతలు పార్టీలు మారడం కూడా బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు. ఉప ఎన్నికలు వస్తే తప్ప అభివృద్ధి జరగదనే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు.