ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీ పడేలా.. సర్కార్‌ బడులను అప్‌గ్రేడ్‌ చేస్తాం: సీఎం రేవంత్‌

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

By అంజి  Published on  10 Oct 2024 1:26 AM GMT
government schools, private schools, CM Revanth, Telangana

ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీ పడేలా.. సర్కార్‌ బడుల అప్‌గ్రేడ్‌: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజులు తెలంగాణలో రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులంతా భవిష్యత్తు తరాలకు నిర్మాతలుగా అంకితభావంతో పని చేయాలని కోరారు. ఎల్బీ స్టేడియం వేదికగా డీఎస్సీ 2024 రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపు పత్రాలను అందించారు.

భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ లాంటి ఎందరో మహామహులను తీర్చిదిద్దినవి ప్రభుత్వ పాఠశాలలేనని ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని చెబుతూ, ఈ సందర్భంగా సీఎం.. ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు.

“విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో బాధ్యతాయుతమైన భావి పౌరువులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానవీయ విలువలతో మెలిగే భవ్య సమాజ నిర్మాణంలో నావంతు పాత్ర నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు ప్రతినబూనారు.

ప్రభుత్వ పాఠాశాల ప్రాధాన్యతను గుర్తించే ఇచ్చిన మాట ప్రకారం.. దసరా పండుగ సంతోషాలు నింపాలని నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో 10 వేల పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటేనే నమోషీగా భావిస్తున్న పరిస్థితిపై అందరూ ఆలోచించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివామని గర్వంగా చెప్పుకునేలా ప్రైవేటు సంస్థలతో పోటీ పడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. తొలిదశలో 5 వేల కోట్లు వెచ్చించి, 25 నియోజకవర్గాల్లో సకల వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు ఈనెల 11న శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సారథ్యంలోని విద్యా కమిషన్ చేసే సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తామన్నారు.

ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించిన బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించామని, ఎక్కడా చిన్న వివాదం లేకుండా 34 వేల మంది టీచర్లకు బదిలీలు చేయడంతో పాటు 21 వేల మందికి ప్రమోషన్లు కల్పించామని తెలిపారు. తెలంగాణ భావితరాలను అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత యువతరం టీచర్లదే. ఆ టీచర్లకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. యువత మాదకద్రవ్యాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Next Story