6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు.
By అంజి Published on 28 Dec 2023 11:45 AM IST6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతాం: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణం అనంతరం రసీదు ఇస్తున్నారు. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్ గ్యారెంటీల వివరాలు ఉన్నాయి. లబ్ధిదారులు.. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్, రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 'ప్రజాపాలన' దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. 'మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం' అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు.
10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదన్న భట్టి.. తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమది అని అన్నారు. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. తమది దొరల ప్రభుత్వం కాదని, ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదని అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.
ప్రజల దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు 'అభయహస్తం' గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.