హైదరాబాద్: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలనే శాంతి భద్రతలు విఘాతం కలిగించి.. అలజడి సృష్టిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ధ్వంసం ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొందరు మందిరాలు, మసీదులపై దాడులు చేయడం ద్వారా వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉండాలి. ముత్యాలమ్మ ఆలయ ధ్వంసం ఆందోళనకరమని అన్నారు.
పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారని, నిందితులను వెంటనే అరెస్ట్ చేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించమని, కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన యోధులందరికీ పోలీసు అమరవీరులకు, కుటుంబాలకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్తవ్యాన్ని నిర్వర్తించంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంతో పాటు త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.