త్వరలో హైదరాబాద్​లో గ్లోబల్​ ఏఐ సమ్మిట్: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనుంది.

By అంజి  Published on  10 Jan 2024 3:08 AM GMT
Global AI Summit, Hyderabad, IT Minister Sridhar Babu

త్వరలో హైదరాబాద్​లో గ్లోబల్​ ఏఐ సమ్మిట్: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణులను ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఐటీ అండ్‌ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రత్యేకమైన పనికి కాకుండా వివిధ రకాల కార్యకలాపాలను నిర్వహణకు రూపొందించే జనరిక్‌ ఏఐలకు మించిన ఏఐ వ్యవస్థల రూపకల్పనకు హైదరాబాద్‌ వేదిక కావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

మంగళవారం గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌తో కలిసి పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఇన్ఫోసిస్‌కు చెందిన రఘు బొడ్డుపల్లి, గూగుల్‌కు చెందిన అరిజిత్‌ సర్కర్‌, టై హైదరాబాద్‌ ప్రతినిధి మురళి బుక్కపట్నం, టీసీఎస్‌ ప్రతినిధి వి.రాజన్న, హైసియా ప్రతినిధి ప్రశాంత్‌ నండూరి, నాస్కాం, ఎస్‌టీపీఐ, టీవీఎజీఎల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం ఐటీ పరిశ్రమ వృద్ధిని పక్కా ప్రణాళికతో అందిపుచ్చుకోవాలని తమ ఆలోచనని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, గ్రీన్‌ టెక్‌, 5జీ టెక్నాలజీ తదితర రంగాలను మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన సదుపాయాల కల్పనతోపాటు, మానవ వనరులను అందుబాటులో ఉంచేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Next Story