జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి
నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని గత పాలకుల విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 9:00 AM GMTనోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని గత పాలకుల విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉద్యోగాల భర్తీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామని ఇందులో 54,573 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. గత పది సంవత్సరాలపాటు ఉద్యోగ నియామకాలు లేక యువకులు అల్లాడిపోయారని.. ఉద్యోగాల కోసం యువత ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది సమయంలోనే 55 నుంచి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. గత పాలకులు పదేళ్ల కాలంలో గ్రూప్ వన్ పరీక్ష ఒక్కసారి కూడా నిర్వహించలేకపోయారు, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు అన్నారు.
మేము అధికారంలోకి రాగానే పాత ఖాళీలు కొత్తవి కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశాము. ఈ పరీక్షలను ఆపాలని కావాలనే కొద్దిమంది కోర్టుకు వెళ్లారు కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం 563 పోస్టులకు పరీక్ష నిర్వహించాము, 11062 ఖాళీలతో డీఎస్సీ నిర్వహించి 10, 600 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా, ప్రశ్నాపత్రం లీక్ వంటివి లేకుండా చూసుకుంటూ ఖాళీలను భర్తీ చేసుకుంటూ పోతున్నామని వివరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా భర్తీ చేసుకుంటూ ముందుకు పోతాం అన్నారు. ఉర్దూ మీడియం లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి డీ రిజర్వేషన్ విధానం పరిశీలించాలని కొందరు సభ్యులు అడిగారు కానీ అందుకు అవకాశం లేదని తెలిపారు.