'ఏపీలో రాజకీయం చేస్తాం, వారికి టికెట్ రాకపోవచ్చు'.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో దరిద్రానికి కాంగ్రెస్, బీజేపీనే కారణమన్నారు.
By అంజి Published on 28 Jun 2023 6:53 AM GMT'ఏపీలో రాజకీయం చేస్తాం, వారికి టికెట్ రాకపోవచ్చు'.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో దరిద్రానికి కాంగ్రెస్, బీజేపీనే కారణమన్నారు. బలహీన ప్రతిపక్షాల వల్లే మోదీ ఆటలు సాగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ విస్తరిస్తుందన్న భయంతో బీజేపీలో ఉందని కేటీఆర్ అన్నారు. ఓ ఛానల్‌లో జరిగిన ముఖాముఖిలో కేటీఆర్ వివిధ అంశాలపై స్పందించారు. తాను 16 ఏళ్లుగా పాలిటిక్స్‌లో ఉన్నానని, నాలుగు ఎలక్షన్స్‌లో పోటీ చేశానని తెలిపారు.
''ప్రతిసారి ఎన్నికల్లో మెజార్టీ పెంచుకుంటూ పోతున్నా.. మొదటి ఎలక్షన్‌లో 171 ఓట్ల తేడాతో గెలిచా.. మొన్నటి ఎలక్షన్‌లో 90 వేల ఓట్లతో గెలిచా, ఒక వేళ ప్రజలు నన్ను వద్దు అనుకునే వారే అయితే చెత్త బుట్టలో పడేసేవారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ కంటే నేనేమి గొప్పడిని కాదు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలా మమ్మల్ని కుటుంబ పార్టీ అనేవారు. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్‌వెల్త్ అంటూ రేవంత రెడ్డే గతంలో చెప్పారు. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ అని రేవంతే అన్నారు.. ఆ విషయం ఇప్పుడు మరిచిపోయారా'' అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రూ.50 లక్షల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడితే దరిద్రంగా ఉంటుందన్నారు. ప్రధాని దద్దమ్మ అని, అందుకే అదానీ గురించి మాట్లాడటం లేదన్నారు. రూ. లక్ష కోట్లు తిన్నారని కేసీఆర్‌ని అంటారా.. ఏమైనా కామన్ సెన్స్ ఉందా అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ వంద శాతం కమిషన్లు తీసుకున్నాడని అంటానని, ఏదైనా మాట్లాడితే ఆధారం ఉండాలి కదా అని ప్రశ్నించారు. రేవంత్ గతంలో సోనియా గాంధీని విమర్శించి, ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో ఉన్నాడని అన్నారు. గోడలకు రంగులు వేసుకునే వాళ్లకు జూబ్లీహిల్స్ లో స్థలాలు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. నయీంను పెంచిపోషించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.
ఏపీలో రాజకీయాలపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ఏపీలో రాజకీయాలు చేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్, వైఎస్ జగన్, నారా లోకేషల్ తనకు స్నేహితులు అని, కానీ ఆ నాయకులు బీజేపీకి ఆప్తులుగా మారారు అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్ షర్మిల ఇక్కడ ఓట్లు ఎలా అడుగుతారు అంటూ నిలదీశారు. ఈటల రాజేందర్ కు ప్రాణహానీ ఉందంటే తానే భద్రతను పెంచుతానని చెప్పారు. హత్యా రాజకీయాలు తమ సంస్కృతి కాదన్నారు. ఈటల తనకు సోదరుడి లాంటి వాడన్నారు. డీజీపీకి భద్రత పెంచమని చెబుతానన్నారు. తనకు సీఎం కావాలనే కోరికలు లేవని, ఎమ్మెల్యేను, మంత్రిని అవుతానని కూడా తాను అనుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్లోబరీనాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. డ్రగ్స్ కేసుతోను సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి ఈ సారి టిక్కెట్ వచ్చే ఛాన్స్ లేదని, ముందస్తుగానే టికెట్లను ప్రకటిస్తామని తెలిపారు. గవర్నర్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. తమది ఒకప్పుడు ఉద్యమ పార్టీ అని, ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీగా మార్చుకున్నామని, అందుకే గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లు కూడా మంత్రి వర్గంలో ఉన్నారని చెప్పారు. తాము ఇతర పార్టీల నుండి నాయకులను చేర్చుకున్నామని, ఉద్యమకారులను ఆదుకున్నామని అన్నారు. అధికారులపై ఆధారపడి తాము రాజకీయాలు చేయమన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారని కేటీఆర్ ఆరోపించారు.
ధరణి పోర్టల్‌తో 99 శాతం సమస్యలేదన్నారు. ధరణి వల్ల అవినీతి వ్యవస్థ రద్దైందన్నారు. పైరవీలు, భూమిని కొట్టేసే వాళ్లకే ధరణిలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై కేటీఆర్ మాట్లాడుతూ.. అప్పులు చేస్తున్నామని, అయితే అది దేనికి ఖర్చు చేస్తున్నామనేది చూడాలన్నారు. కాళేశ్వరం కోసం రూ.1 లక్ష కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.11వేల కోట్లు, కరెంట్ కోసం రూ.81వేల కోట్లు, తాగునీటి కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిందని గుర్తు చేశారు. తాము ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పు చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిమితికి లోబడి అప్పు చేయవచ్చునన్నారు.