పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతాం.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు: సీఎం రేవంత్
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని...
By - అంజి |
పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతాం.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు: సీఎం రేవంత్
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రైతులు, నీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మా చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొలి విడతగా 45 టీఎంసీలు, రెండో విడతగా 45 టీఎంసీలు అనుమతించాల్సిందేనని, లేదంటే జూరాల నుంచి నేరుగా నీటి తరలిస్తామని హెచ్చరించారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం సాధించవచ్చని, వివాదాలపై పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా వివిధ హోదాల్లో కమిటీలను వేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.
నీళ్లు – నిజాలు అన్న అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మొత్తం 490 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన 24 ప్రాజెక్టులు మంజూరైన వివరాలను గణాంకాలతో సహా వివరించారు.
కృష్ణా జలాల్లో 490 టీఎంసీల నీరు తెలంగాణ హక్కు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్‌లో అనేక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాటు పరిపాలించిన నాయకులు తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 490 టీఎంసీలు కేటాయిస్తే.. 299 టీఎంసీలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని అడిగానని చెబుతున్న విషయం కూడా వాస్తవం కాదన్నారు. రాష్ట్ర ఖర్చుతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు.
“కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశానికి రెండు సార్లు కేసీఆర్ వెళ్లారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు దీనికే కట్టుబడి ఉంటామని సంతకం పెట్టారు. ఎప్పుడైతే ఆ వెసులుబాటు ఇచ్చారో దాన్ని ఆంధ్రప్రదేశ్ అవకాశంగా వినియోగించుకుంది.
నిజానికి గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు 2016 లోనే పునాది పడింది. గోదావరిలో మిగులు జలాలున్నాయని, వాడుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆ తప్పిదాన్ని సవరించుకోవడానికి 2020 లో బంగారం లాంటి అవకాశం వచ్చినా కేసీఆర్ ఎందుకనో ఉపయోగించుకోలేదు.
అంతర్జాతీయ జల వివాదాల పరిష్కారం మేరకు, పరీవాహక ప్రాంతానికి ముందు నీళ్లివ్వాలి. పరీవాహక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో 71 శాతం ఉంది. 811 టీఎంసీల్లో తెలంగాణకు 555 టీఎంసీలు రావాలి. 1005 టీఎంసీల నీటి లభ్యత ఉందని ట్రిబ్యునల్ ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణకు 763 టీఎంసీలు రావాలి.
ఈ లెక్కల మేరకు ప్రభుత్వం కొట్లాడుతుంటే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారు. 2014 వరకు రాయలసీమకు 4.47 టీఎంసీల నీటిని తరలిస్తుండగా, 2014 తర్వాత నుంచి 13.12 టీఎంసీలు తరలిస్తున్నారంటే ఇది గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందించిన బహుమానం.
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చాలని ఎవరూ చెప్పలేదు. 3 లిఫ్టులు, 22 పంపులతో పూర్తి చేయాల్సిన దాన్ని శ్రీశైలంకు మార్చి లిఫ్టుల సంఖ్యను 5 కు, పంపులను 37 కు పెంచారు.
జూరాల నుంచి సోర్సుగా ప్రారంభిస్తే ప్రతి దశలోనూ నీటి పారుదల ప్రాంతాన్ని స్పష్టంగా నిర్దేశించారు. కానీ శ్రీశైలం నుంచి సోర్సుగా ఎంపిక చేసిన పథకంలో 19 పంపుల వరకూ నీటి వాడకం నిల్. పైగా 2022 వరకు ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయలేదు. 55,800 కోట్లకు అంచనాలను పెంచారు.
32,200 కోట్లతో ప్రారంభమైన పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు కట్టాలంటే 1 లక్ష కోట్లకు చేరుకునే పరిస్థితి. ఏడు సంవత్సరాల పాటు ఎలాంటి అంచనాలు లేకుండానే కాంట్రాక్టర్లకు 20 వేల కోట్లు ఖర్చు చేశారు.
జూరాల నుంచి శ్రీశైలంకు సోర్సును మార్చినా అది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం 7.15 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టు మాత్రమేనని ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో అఫిడవిట్ దాఖలు చేశారు. పంపులకు, లిఫ్టులకు బిల్లుకు చెల్లించాలన్న ఆలోచనతో తాగునీటి కోసం అలా చేశారు.
12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని.. రూ. 55 వేల కోట్ల అంచనాలు చూపించి.. చివరకు అది సాగునీటి ప్రాజెక్టే కాదు. తాగునీటి ప్రాజెక్టని పేర్కొన్నారు. పైగా 45 టీఎంసీలకు ఎలా ఒప్పుకున్నారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.
70 టీఎంసీలకు గాను జురాల వద్ద ప్రాజెక్ట్ కట్టడానికి.. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్ట్ ను ఆపడానికి వీల్లేదు. జూరాల దగ్గర 70 టీఎంసీల వరద జలాలతో 2013 ప్రతిపాదిత ప్రాజెక్టుల చేపట్టుకోవచ్చని చట్టబద్ధత కల్పించబడింది..” అని వివరించారు.