పేదల వైద్యానికి రికార్డు స్థాయిలో 835 కోట్ల రూపాయలు: సీఎం రేవంత్
గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 3 Dec 2024 1:21 AM GMTపేదల వైద్యానికి రికార్డు స్థాయిలో 835 కోట్ల రూపాయలు: సీఎం రేవంత్
గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసిన పనులను గమనిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళతామో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటేలా 7, 8, 9 తేదీల్లో తెలంగాణ అవతరణ ఉత్సవాలు, మొదటి సంవత్సర విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు. నెక్లెస్ రోడ్డులో ఆ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే తెలంగాణ కార్నివాల్‌లో అందరూ పాల్గొని ఆస్వాదించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ పారా మెడికల్ కాలేజీలను వేదిక నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 ట్రాన్స్‌జెండర్ (మైత్రి ట్రాన్స్ క్లినిక్స్) క్లినిక్కులను ఈ వేదిక నుంచి సీఎం ప్రారంభించారు.
కొత్తగా నియమితులైన 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌కు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందించారు. అంతకుముందు 200 పైచిలుకు అంబులెన్స్‌లకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అని భావించి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడంపై విడమరిచి చెప్పారు.
''పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్‌గా మార్చదల్చుకోలేదు. అదొక ఉన్నతమైన సంస్థ. అందుకే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద ఏడాదిలో పేదల వైద్యానికి రికార్డు స్థాయిలో 835 కోట్ల రూపాయలు అందించాం. గత ప్రభుత్వం 450 కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేదు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే వైద్య ఆరోగ్య శాఖలో 14 వేలకు పైచిలుకు నియామకాలు పూర్తి చేయడమే కాకుండా ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు'' అని సీఎం రేవంత్ అభినందించారు.