పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం : మహేందర్ రెడ్డి
We have brought many reforms in the police department says Mahender Reddy.డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం నేటి
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2022 5:31 AM GMTతెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం నేటి(శనివారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీ కుమార్‌కు అభినందలు తెలిపారు. 36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో ఒక సభ్యుడిగా ఉంటూ శక్తి వంచన లేకుండా పని చేసినట్లు చెప్పారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల పాటు పోలీస్ విభాగంలో కీలక పదవులు నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు, వివిధ కాలనీల సంఘాలు, కార్పొరేటర్లు సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగలిగినట్లు చెప్పారు. 36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పని చేసినప్పుడు తనకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న అంజనీకుమార్ మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డితో కలిసి పని చేయడం తన అదృష్టంగా బావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అధికారులు చాలా అరుదుగా ఉంటారని, ఎన్నో రకాలుగా మహేందర్ రెడ్డి తనకు ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అంజనీకుమార్ అన్నారు.