భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లోకి ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా నాగులవంచలో దళితబంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. 847మంది లబ్ధిదారులకు సుమారు 15కోట్ల మంజూరు పత్రాలను భట్టివిక్రమార్క పంపిణీ చేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని, ప్రతి ఏడాది ఈ డబ్బులను అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి, సాగునీరు, పారిశ్రామిక రంగాల అభివృద్దితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం పోలీసు పరేడ్ మైదానంలో భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.