Warangal: మామ్‌నూర్ ఎయిర్‌పోర్ట్.. భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
వరంగల్ వాసుల కల నెరవేరబోతోంది. త్వరలోనే మామ్‌నూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.
By అంజి
Warangal: మామ్‌నూర్ ఎయిర్‌పోర్ట్.. భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల
వరంగల్ వాసుల కల నెరవేరబోతోంది. త్వరలోనే మామ్‌నూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) నంబర్ 43 ద్వారా ప్రతిపాదించిన మేరకు వరంగల్‌లోని మమ్‌నూర్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రూ.205 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 693 ఎకరాలకు అనుబంధంగా రూ.1200 కోట్లు మంజూరు చేయాలని, అదనంగా మరో 300 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ విస్తరణ ప్రస్తుత రన్‌వేని 1.8 కి.మీ నుండి 3.9 కి.మీ వరకు విస్తరించడానికి ఉద్దేశించబడింది.
ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (IFR) ఆపరేషన్‌ల కోసం A-320 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లకు వసతి కల్పించేందుకు వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి తమ సంసిద్ధతను ఏఏఐ వారి ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఏఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన ఖర్చులను భరించడానికి కూడా కట్టుబడి ఉంది. మంజూరైన 253 ఎకరాలను ఏఏఐ రన్‌వే నిర్మించడానికి, విస్తరించడానికి, టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) భవనాన్ని నిర్మించడానికి, నావిగేషనల్ ఇన్‌స్ట్రుమెంట్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగిస్తుంది.
అదనంగా, ఏఏఐ రాష్ట్ర రోడ్లు అండ్ భవనాల శాఖ నుండి లేఖలో అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. మమ్నూర్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణకు సంబంధించి రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌తో అక్టోబర్ 23న జరిగిన సమావేశం తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. అనంతరం కేటాయించిన రూ.205 కోట్లను మంజూరు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.