తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆదివాసీ మహిళ రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చింది. నట్టడవిలో గర్బిణీ ప్రసవం కోసం నరకం అనుభవించింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో సకాలంలో మహిళను ఆస్పత్రికి తరలించలేకపోయారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా.. వాహనంలో ఇంధనం లేదని సమాధానం చెప్పారు. పెంబి మండలం మారుమూల తులసిపేట్ గ్రామానికి చెందిన గంగామణికి గురువారం రాత్రి ప్రసవ నొప్పి వచ్చింది. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో, మహిళ కుటుంబ సభ్యులు ఆమెను తమ చేతులపై ఎత్తుకుని వాగు దాటి సమీప రహదారికి చేరుకున్నారు.
ప్రభుత్వాసుపత్రికి వెళ్లేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. రోడ్డుసరిగా లేదని గ్రామం వరకు రాలేమని పస్పుల బ్రిడ్జ్ దాటించి తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. అయితే ఒడ్డుచేరాక కూడా అంబులెన్స్ రాలేదు. మళ్లీ ఫోన్ చేయగా.. అంబులెన్స్‌లో డిజీల్ అయిపోయిందంటూ సమాధానం ఇవ్వడంతో చేసేది లేక అదే ఎండ్ల బండిలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే ఆ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. చివరకు గర్భిణీ నాలుగు గంటలపాటు వేదనను అనుభవించి కుటుంబ సభ్యుల సాయంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. మగబిడ్డ, మహిళ క్షేమంగా ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.