హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..విధుల్లోకి తీసుకోవాలని వీఆర్‌ఏల నిరసన
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది.
By Knakam Karthik Published on 4 Feb 2025 10:58 AM ISTహైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..విధుల్లోకి తీసుకోవాలని వీఆర్‌ఏల నిరసన
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్ వద్దకు చేరుకొని ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు, వీఆర్ఏలను మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్ఏలు 'వీ వాంట్ జస్టిస్' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, 81, 85 జీవోల ప్రకారం వారసులకు ఉద్యోగాల ప్రకటన చేయాలని పలు డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులను ప్రదర్శించారు. అంతేగాక తమని విధుల్లోకి తీసుకోకపోగా.. తమ గోడు వెల్లబోసుకునేందుకు మంత్రులను కలవకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. జీవో ఇచ్చి విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ తో వీఆర్ఏ జేఏసీ ఆద్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంలో వీఆర్ఏల దీర్ఘకాలిక పోరాటం తర్వాత వీఆర్ఏ జేఏసీతో చర్చలు జరిపి ప్రభుత్వం 81, 85 జీవోలను విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20, 555 మంది వీఆర్ఏల్లో వారి విద్యార్హతల ప్రకారం ఆయా శాఖల్లో 16, 758 మందిని ప్రభుత్వం సర్ధుబాటు చేసిందని, మిగిలిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా కాలయాపన చేసిందని వివరించారు. ఉద్యోగం రాక వీఆర్ఏల వారసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఒత్తిడితో 265 మంది మరణించారని, అయినా ప్రభుత్వం ఎలాంటి చలనం రాలేదని వాపోయారు. ఇక ఖాళీగా ఉన్న 3,797 మంది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి, ప్రభుత్వం తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ.. వీఆర్ఏ జేఏసీ ప్రకటన విడుదల చేసింది.