హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. బస్టాండ్లు కిటకిట

తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 Nov 2023 9:51 AM GMT
voters,  own villages,  telangana, elections  ,

 హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. బస్టాండ్లు కిటకిట

తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు స్లిప్పులు పంచడం నుంచి.. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత సిబ్బందిని నియమించడం వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మొదట్నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. అయితే.. ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే ప్రయివేట్ సంస్థలు కూడా పోలింగ్ సందర్భంగా సెలవు ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు గురువారం సెలవు దినం కావడంతో పాటు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలంతా సిద్ధం అయ్యారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన వారంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌తో పాటు పలు బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సొంత ఊర్ల నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ జీవనం సాగిస్తున్న చాలా మంది ఓటర్లు ఇప్పటికే సొంత గ్రామాలకు తిరిగి వచ్చేస్తున్నారు. సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఎంబీజీఎస్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంజీబీఎస్‌ ప్రయాణికులతో ప్రస్తుతం కిటకిటలాడుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఎన్నికల సందర్భంగా రెండ్రోజుల పాటు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఇటు ఆఫీసులు.. స్కూళ్లు లేకపోవడంతో ప్రజలంతా సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఇటు ఓటు హక్కు వినియోగించుకునట్లు ఉంటుందనీ.. అలాగే రెండ్రోజులు సొంత గ్రామానికి వెళ్లి వచ్చామనే ఉత్సాహం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చేసిన ప్రచారం సత్ఫలితాలను ఇస్తుందని అర్థం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. ఓటు వెయ్యటం కోసం గ్రామాలకు తరలివస్తున్న ఓటర్లతో గ్రామాలలో సందడి వాతావరణం చోటుచేసుకుంది.

Next Story