పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు.. విడుదల చేయాలని విమలక్క డిమాండ్
జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, ఆయన సోదరుడు అమర్‌ను నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు.. విడుదల చేయాలని విమలక్క డిమాండ్
జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, ఆయన సోదరుడు అమర్‌ను నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజన్న పోలీసుల అదుపులో ఉండడం, పోలీసులు ధ్రువీకరించకపోవడంతో ఆయనకు ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా అని జనశక్తి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు పట్టుకుని తెలియని ప్రాంతానికి తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో ఓ మాజీ ప్రజాప్రతినిధి నిర్వహించిన సమావేశానికి పలువురు జనశక్తి మాజీ నాయకులు హాజరయ్యారని, ఆ విషయంపైనే వారిని విచారిస్తున్నట్టు సమాచారం. మరోవైపు జనశక్తి నాయకులు కూర రాజన్న, అమర్ లతో పాటు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ బేషరతుగా విడుదల చెయ్యాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక విమలక్క, కొమురన్న, సంతోష్‌లు డిమాండ్ చేశారు.
జనశక్తి నాయకుడు కూర రాజన్న ఏప్రిల్ నెలలో జైలు నుండి విడుదలై కేసుల మీద కోర్టుకు హాజరవుతూనే ఉన్నారని, కూర రాజన్న 12 రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. కూర రాజన్న అనారోగ్య సమస్యల గూర్చి వైద్యులు రాజన్నకు సోదరుడైన అమర్‌కు తెలిపారు. కూర రాజన్నకు అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో, రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ద్వారా అమర్ కు తెలియడంతో రాజన్నను కలవడానికి వెళ్ళాడని, వైద్యం కోసం వెళ్ళిన కూర రాజన్నను, అతనికి అనారోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం వెళ్ళిన అమర్ లను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కూర రాజన్నకు వైద్య సహాయకుడిగా ఉన్న వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందన్నారు. కూర రాజన్న, అమర్ లతో పాటు అక్రమంగా అరెస్టు చేసిన వాళ్లందరినీ తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే కూర రాజన్నకు వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అని డిమాండ్ చేస్తున్నామన్నారు.