వారు రాజకీయ శత్రువుల తీరుగా మాట్లాడటం శోచనీయం
Vijayashanti About Farmers Protest. రిపబ్లిక్ డే సంఘటనల వరకూ కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందని.
By Medi Samrat
రిపబ్లిక్ డే సంఘటనల వరకూ కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు కొనసాగిస్తూనే వచ్చిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఇరు పక్షాలూ ఎంతో సంయమనంతో వ్యవహరించాయని అన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి చర్చలకు ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటామని సానుకూల దృక్పథంతో ప్రకటిస్తే.. రైతు సంఘాల నాయకులు మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా గద్దె దిగుతారా? అని రాజకీయ శత్రువుల తీరుగా మాట్లాడటం శోచనీయమని అన్నారు.
ఇవి వారి మాటలా? లేదా వెనుక నుండి ప్రేరేపిత విరోధులు అనిపిస్తున్నారా?.. అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని విజయశాంతి అన్నారు. అయినా.. ఒకటిన్నర సంవత్సరాల పాటు అమలు కాని, అమలుకు రాని చట్టాలపై ఇప్పుడెందుకు ఇంత యాగీ పెట్టి ఆగం చేస్తున్నారు? ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో చర్చలకు సిద్ధంగా ఉండగా.. ఎందుకు ఈ ధోరణి ఎంచుకున్నట్లు? జనవరి 26 పరిణామాల తర్వాత సమస్య ఇంకా ఇలాంటి ప్రకటనల వల్ల జఠిలమవుతూ వస్తుందే కానీ, పరిష్కారానికి దోహదపడటం లేదని రైతు సంఘాల నేతలు అర్థం చేసుకోవాలని హితువు పలికారు.
ఇక అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు కొందరు ఏ ప్రోద్బలంతో భారతదేశ అంతర్గత అంశంపై ఇంత అక్కర పెట్టి ట్విటర్ పోస్టింగులకు తెగబడుతున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. రైతు ఉద్యమంలోనే కొందరు మాకు తెలియకుండా ఎర్రకోట సంఘటనలకు పాల్పడ్డారని నేతలు చెబుతున్నప్పుడు, వారి నియంత్రణలో ఉద్యమం లేదని వారే ఒప్పుకున్నట్లు స్పష్టమైంది అన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు.. పోలీసులకే రక్షణ లేక దాడులతో దెబ్బలు తిన్నప్పుడు.. తల్వార్ దాడులు జరుగుతున్నప్పుడు.. ట్రాక్టర్లతో ఢీ కొట్టబడుతున్నప్పుడు.. అదుపు తప్పితే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? వారి ప్రాణాలకు హామీ ఎవరిస్తారు? అని ఆమె రైతు ఉద్యమకారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.