ఫేస్‌బుక్‌లో రాహుల్‌ ఫోటోను తొలగించిన విజయశాంతి.. నేడు బీజేపీలో చేరే అవకాశం

Vijayashanthi facebook profile pic change .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌

By సుభాష్  Published on  27 Nov 2020 2:11 AM GMT
ఫేస్‌బుక్‌లో రాహుల్‌ ఫోటోను తొలగించిన విజయశాంతి.. నేడు బీజేపీలో చేరే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ రాములమ్మ విజయశాంతి పార్టీ మార్పుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తన సోషల్‌ మీడియా ఖాతాలో ప్రోఫైల్‌ ఫోటోను మార్చారు. ఇది వరకు రాహుల్‌ గాంధీతో ఉన్న ఫోటోను తొలగించి, కాషాయం కలర్‌తో నింపేశారు. దీంతో ఆమె కాంగ్రెస్‌కు దూరమైనట్లేనని సంకేతాలు వెలువడుతున్నాయి. 2020 నవంబర్‌ 27న బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ అధ్యక్షుడు నడ్డా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్న ఆయన సమీక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీ మారుతున్నారన్న సంకేతాలు చాలా రోజులుగా వినిపిస్తున్నా.. విజయశాంతి మాత్రం పార్టీ మార్పుపై స్పందించలేదు. విజయశాంతితో పాటు మరి కొంత మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలకు విలువ లేదని రాములమ్మ ఎన్నో రోజుల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సైతం విజయశాంతితో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేత మాణిక్యం ఠాగూర్‌ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వేరే పార్టీలోకి వెళ్లరాదని, తగిన గౌరవం తగ్గేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అయినా విజయశాంతి పెద్దగా స్పందించలేదు.

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న విజయశాంతి కొంత కాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ప్రచార కమిటీ బాధ్యతలు ఉండి కూడా ఆమె అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతేకాకుండా కాంగ్రెస్‌ను గెలిపించాలని ఎక్కడ కూడా కోరలేదు. సోషల్‌ మీడియాలో సైతం కాంగ్రెస్‌ను గెలిపించాలని కూడా కోరలేదు. అలాగే ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్ల పోలీసుల వ్యవహారం తీరుపై కూడా విజయశాంతి ఖండించారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ పార్టీ విజయశాంతి పార్టీ మారే అవకాశం ఉందని వెళ్లకుండా ప్రయత్నాలు చేశారు. తాజాగా ఫేస్‌ బుక్‌ ప్రోఫైల్‌ ఫోటోను చూస్తే బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయిందని రాజకీయ నేతలు చెబుతున్నారు.

Next Story
Share it