వసంత పంచమి వేడుకలు.. అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Vasantha Panchami Celebrations in Basara.చ‌దువుల తల్లి అయిన నిర్మల్‌ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 6:01 AM GMT
వసంత పంచమి వేడుకలు.. అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

చ‌దువుల తల్లి అయిన నిర్మల్‌ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. సరస్వతీ దేవి జన్మించిన రోజు కావడంతో అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఎంతో ప‌విత్ర‌మైన ఈ రోజున త‌మ చిన్నారుల‌కు అక్షరాభ్యాసం చేయించడానికి భక్తులు పెద్ద సంఖ్య‌లో ఆల‌యానికి వ‌చ్చారు. చాలా మంది భ‌క్తులు ముందురోజునే ఆల‌యానికి చేరుకుని ఆల‌య ఆవ‌ర‌ణ‌లో నిద్రించారు.

తెల్ల‌వారుజామున రెండు గంట‌ల‌కు అమ్మ‌వారికి అభిషేకం, ప్ర‌త్యేక పూజ‌ల‌ను ఆల‌య పండితులు నిర్వ‌హించారు. అనంత‌రం మూడు గంట‌ల నుంచి అక్ష‌రాభ్యాసాలు కొన‌సాగుతున్నాయి. ఉదయం గోదావరిలో పుణ్య స్నానా లు ఆచరించి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. దేవాదాయ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు వ‌సంతపంచమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంత‌క‌ముందు మంత్రికి ఆల‌య పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అందజేశారు.

ఆ త‌రువాత మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్టాడారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వ‌సంత పంచ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింద‌ని చెప్పారు. బాస‌ర ఆల‌య అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. భ‌విష్య‌త్తులో ఆల‌యాన్ని మ‌రింత అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

బాస‌ర ఆల‌యానికి భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆల‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా 300 పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు.

Next Story