రామగుండం, మంచిర్యాలకు వందే భారత్ రైలు!
త్వరలోనే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్‌పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది.
By అంజి Published on 7 Jun 2023 3:30 AM GMTరామగుండం, మంచిర్యాలకు వందే భారత్ రైలు!
త్వరలోనే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్‌పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. సుమారు 580 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో వందేభారత్ రైలును ప్రవేశపెడితే.. దాదాపు నాలుగు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ మార్గంలో 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు గరిష్ఠంగా 10 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్‌లో అయితే ఆరు గంటల్లోనే గమ్యానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్గంలో వందేభారత్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. ఒక వేళ వందే భారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్ మార్గంలో కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్, సిర్పూర్ స్టేషన్లలో రైలుకు హాల్టింగ్ ఉండే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే ఈ మార్గాల మధ్య ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా ఏ స్టేషన్‌లోనూ వందేభారత్ రైలును ఆపలేదు. వందే భారత్ రైలు ఇప్పటికే 18 మార్గాల్లో నడుస్తున్నాయి. ఈ మార్గంలోని నడవనున్న రైలు 19వది కానుంది. త్వరలోనే ఈ రైలు రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే పెద్దపల్లి జంక్షన్‌లో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం లేదని తెలిసి.. మహారాష్ట్ర, నాగ్‌పూర్, బల్లార్షా వాసులు, నిత్యం వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారు అసంతృప్తికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.