ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్టు.. ఏపీ,తెలంగాణ సరిహద్దుల్లో
Vanama Raghava arrested.పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2022 2:50 AM GMTపాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రామకృష్ణను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతపూడి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వనమా రాఘవ అరెస్టును జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. నేడు(శనివారం) నాడు రాఘవను కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు రాఘవ అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. పాల్వంచ ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారించేందుకు ఏఎస్పీ ఎదుట హాజరు కావాలంటూ గురువారం రాత్రి రాఘవ నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. తమ ఎదుట హాజరుకాకుంటే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రాఘవపై తీవ్ర ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
పాల్వంచకు చెందిన రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించుకుని తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకునే క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తగా వనమా రాఘవ అందులో తలదూర్చాడని, తన భార్యను హైదరాబాద్ తీసుకువచ్చి అప్పగిస్తే ఆస్తి దక్కేలా చూస్తానని బేరం పెట్టాడని.. కాగా.. ఈ అవమానాన్ని భరించలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని బాధితుడు రామకృష్ణ మాట్లాడిన సెల్పీ వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది.