వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
By అంజి
వనజీవి రామయ్య కన్నుమూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2016లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. చిన్నతనం నుండే చెట్లను పెంచండి అంటూ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య ప్రచారం చేశారు. తన జీవితం అంతా మొక్కలు నాటడానికే కేటాయించిన రామయ్య.. తన ఇంటి పేరును సైతం వనజీవిగా మార్చుకున్నారు.
ఆయన పర్యావరణానికి చేసిన కృషికి గాను 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర, యూనివర్సల్ గ్లోబల్ పీస్ ’ అనే అంతర్జాతీయ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు, ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డులు వరించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు.
మనుమళ్లు, మనుమరాళ్లకుకూడా చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశాడు. ఈ పేర్లను చూస్తేనే మనకు అర్థమవుతుంది రామయ్యకు చెట్లంటే ఎంత ప్రాణమో అని.