పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే : మంత్రి హ‌రీశ్‌రావు

Vaccination Drive for 15 to 18 age group starts in Telangana.తెలంగాణ రాష్ట్రంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 12:45 PM IST
పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే : మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లోని అర్భ‌న్ ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ లో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల వ్యాక్సిన్ ఒక ర‌క్ష‌ణ క‌వ‌చంలా పని చేస్తోంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న చిన్నారులు 18లక్ష‌ల 70 వేల మంది వ‌ర‌కు ఉన్నార‌ని.. వీరంద‌రికి త్వ‌రిత‌గ‌తిన, వేగ‌వంతంగా వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్రంలో 1014 కేంద్రాల్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్న‌ట్లు తెలిపారు. అవ‌స‌రం అయితే.. వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య‌ను పెంచుతామ‌న్నారు.

హైద‌రాబాద్‌తో పాటు 12 కార్పొరేష‌న్ల‌లో పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌రువాతే టీకా వేయించుకోవాల‌ని సూచించారు. ఇత‌ర ప‌ట్ట‌ణాలు మండ‌లాల్లో నేరుగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌తో పాటు 12 కార్పొరేష‌న్ల‌లో ర‌ద్దీ ఏర్ప‌డొద్ద‌నే ఉద్దేశ్యంతో రిజిస్ట్రేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించినట్లు చెప్పారు. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముందంజ‌లో ఉంద‌ని అన్నారు.

అర్హులైన పిల్ల‌లు అంద‌రూ వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్స‌హించాల‌ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు కూడా సూచ‌న‌లు చేసిన‌ట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనూ పిల్ల‌ల‌కు టీకాలు ఇచ్చేందుకు అనుమ‌తులు ఇచ్చామ‌న్నారు. త‌ల్లిదండ్రులంతా విధిగా త‌మ పిల్ల‌ల‌ను వ్యాక్సిన్ కేంద్రాల‌కు తీసుకొచ్చి టీకాలు వేయించాల‌ని కోరారు. పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దేన‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఫ‌స్ట్ డోసు తీసుకున్న నాలుగు వారాలు కాగానే రెండో డోసును ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారికి, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు బూస్ట‌ర్ డోసు జ‌న‌వ‌రి 10వ తేదీ ప్రారంభంకానుంద‌ని వెల్ల‌డించారు.

ఇక మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సింసిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో 21ల‌క్ష‌ల హోంఐసోలేష‌న్ కిట్ల‌ను రెడీ చేశాం. త‌గినంత ఆక్సిజ‌న్ అందుబాటులో ఉంది. ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే స‌మీపంలోని ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. మందుల‌ను ఉచితంగా ఇస్తున్నాం. ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను వెళ్లి డ‌బ్బుల‌ను వృధా చేసుకోవ‌ద్దు అని మంత్రి హరీశ్ రావు సూచించారు.

Next Story