ఎన్నో పోరాటాల ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. అయితే ఇది కొంత మంది కబంద హస్తాల్లో మగ్గిపోతుందని అన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. బీసీలకు అత్యంత ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీయే ఇస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్‌లను తగ్గించిన తెరాసకు బుద్ధి చెప్పాలని సూచించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఫిషర్‌మెన్ ఛైర్మన్‌గా మెట్టు సాయి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రం సాధించిన తర్వాత యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. సరైన ఉద్యోగవకాశాలు వస్తాయని మంచి జీవితం గడుపుతామని అనుకున్నారు. కానీ వారి ఆశలు నిరాశలు చేస్తుంది అధికార పార్టీ. ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ని ద్వేశిస్తుందని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్, బిజెపీ కి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పిన మోదీ.. ఇప్పుడు పెట్రోల్ ధరలను వంద రూపాయలకు పెంచారని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, నగేశ్, డీసీసీ అద్యక్షులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.