తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఇప్పుడు ఆ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. యువతకు ఉద్యోగవకాశాలు ఇప్పిస్తామని ఊరిస్తూ వచ్చిందన్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఎంతో మంది ఉపాది కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లక్షా 91 వేల ఉద్యోగులు భర్తీ చేస్తూనే.. నిరుద్యోగులకు రెండేళ్లుగా ఇవ్వాల్సిన భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినందునే ప్రభుత్వం.. 50 వేల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ప్రకటించిందని ఉత్తమ్ విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్న సీఎం కేసీఆర్.. నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. పట్టభద్రుల, సాగర్ ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ ఓడిస్తేనే రూ. 3016 భృతి తప్పనిసరిగా వస్తుందని వెల్లడించారు. ముందు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించిన తర్వాతనే ప్రజలను కేసీఆర్ ఓట్లు అడగాలని హితవు పలికారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు.. చిన్నారెడ్డి, రాములు నాయక్‌కు గాంధీ భవన్లో ఉత్తమ్ బీ ఫారాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన హామీలను బిజెపీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.