తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కలకలం..వీఆర్ఎస్‌కు ఆ శాఖ సెక్రటరీ దరఖాస్తు
తెలంగాణ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖలో కలకలం నెలకొంది.
By - Knakam Karthik |
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కలకలం..వీఆర్ఎస్‌కు ఆ శాఖ సెక్రటరీ దరఖాస్తు
తెలంగాణ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖలో కలకలం నెలకొంది. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ దరఖాస్తు చేయడం ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎక్సైజ్ శాఖలో ఓ భారీ స్కామ్ కారణంగానే రిజ్వీ తప్పుకోబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ స్కామ్‌లో తాను ఇరుక్కుంటాననే భయంతో వాలంటరీ రిటైర్మెంట్ దిశగా రిజ్వీ వెళ్తున్నట్లు సమాచారం. కాగా రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ వ్యవహారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి వెళ్లిందని.. అక్రమాలు బయటికొస్తున్నందున రిజ్వీ వీఆర్ఎస్ లేఖను తిరస్కరించాలని సీఎస్‌కు జూపల్లి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 11వ తేదీన సీఎస్‌కు మంత్రి జూపల్లి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
రిజ్వీకి అత్యున్నత పదవులు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆకస్మికంగా వీఆర్‌ఎస్ తీసుకోవడంపై రాజకీయ ఒత్తిళ్లే కారణమా? అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలను మరింత బలపరుస్తూ.. రిజ్వీ వీఆర్‌ఎస్‌కు ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిసింది. అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్టు లేఖలో మంత్రి పేర్కొన్నారు. విధుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా లేఖలో పేర్కొన్నారు. మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగించారని తన శాఖలో ఆయన చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై హోలోగ్రామ్ వేసే కాంట్రాక్‌ను 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇది మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. పాతవారికే అవకాశాలు ఇస్తూ వస్తున్నారని లేఖలో మంత్రి లేఖలో పేర్కొన్నారు
ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఐఐఎం అహ్మదాబాద్‌లో మార్కెటింగ్ అండ్ పబ్లిక్ పాలసీ చదివిన రిజ్వీ తన 26 ఏళ్ల సర్వీసులో నిజాయితీగా పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో పాడేరు ఐటీడీఏ పీవో, నల్గొండ కలెక్టర్, వైద్య-ఆరోగ్యశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ వంటి కీలక హోదాల్లో పనిచేశారు. తన ఐఏఎస్ ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని, కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని రిజ్వీ స్పష్టం చేశారు.
నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయం తీసుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1999వ బ్యాచ్‌కు చెందిన రిజ్వీ.. మరో పదేళ్ల పాటు సర్వీసులో కొనసాగే అవకాశం.. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్థాయికి, కేంద్రంలో కార్యదర్శి స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలను చూపుతూ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.