రూ.2 వేల కోట్లతో ఐటీఐల అప్‌గ్రేడ్: సీఎం రేవంత్
ఈ దేశ సంపదే యువత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లిలో ఐటీఐలో ఏటీసీకు ఆయన శంకుస్థాపన చేశారు.
By అంజి Published on 18 Jun 2024 11:25 AM GMTరూ.2 వేల కోట్లతో ఐటీఐల అప్‌గ్రేడ్: సీఎం రేవంత్
ఈ దేశ సంపదే యువత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లిలో ఐటీఐలో ఏటీసీకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పది 10 మంది ఐటీ నిపుణుల్లో నలుగురు తెలుగువారు ఉండటం గర్వకారణమని అన్నారు. గ్రామీణ, చిన్న పట్టణాల నుంచి వచ్చే యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చి.. వారిని మెరికలుగా మార్చుతామన్నారు. అందులో భాగంగానే ఐటీఐలో ఏటీసీలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలోని 65 ఐటీఐలను రూ.2,324.21 కోట్ల నిధులతో ఏటీసీ (అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్)లు అప్‌గ్రేడ్ చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఐటీఐ పరిస్థితి వేరు.. ప్రస్తుతం ఐటీఐ పరిస్థితి వేరని అన్నారు. ఈ ఐటీఐలపై తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత ఐటీఐ కోర్సులో చేరాలని పిలుపునిచ్చారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగాలైన వస్తాయని, ఉపాధి అవకాశాలైన ఉంటాయని పేర్కొన్నారు.
కాగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
ఐటీసీలకు సంబంధించిన ముఖ్య అంశాలు..
- 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
- ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటు చేస్తారు.
- శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుంది.
- ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘ కాల (లాంగ్ టర్మ్) కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల స్వల్ప కాలిక (షార్ట్ టర్మ్) కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.
- గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు.
- ఐటీఐలను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)
- ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాలజీ హబ్) పని చేస్తాయి.
- ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
- ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయి.