హైదరాబాద్: రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. ఇవాళ కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. గాలి వానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. తర్వాత సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన శాంతి కుమారి, రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అవసరమైన సూచనలు చేశారు.