నేడు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఫిబ్రవరి 15,2024న కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

By అంజి  Published on  15 Feb 2024 2:56 AM GMT
Union Minister Kishan Reddy,Komuravelli Railway Station , SCR

ప్రతీకాత్మకచిత్రం

కొత్తపల్లి - మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలోని సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ను నిర్మించబోతున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఫిబ్రవరి 15,2024న కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ఇతేర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది తీర్థయాత్రికులు ఈ ఆలయ పట్టణానికి ప్రధాన దైవం ఆశీర్వాదం కోసం వస్తారు. ఈ ఆలయ పట్టణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ.. కొమురవెల్లిలో హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఆమోదించింది. నూతన హాల్ట్ స్టేషన్ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తూ మొదటి సారిగా రైలు అనుసంధానాన్నిఅందిస్తుంది. ఈ స్టేషన్ మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలు మార్గంలో ఉంది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో భాగమైన, మనోహరాబాద్ – సిద్దిపేట రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు.

ప్రతిపాదిత కొమురవెల్లి స్టేషన్ ఇప్పటికే రైళ్లు రాకపోకలు సాగిస్తున్న లకుడారం, దుద్దెడ స్టేషన్‌ల మధ్యనున్నది. నూతనంగా నిర్మించబోవు స్టేషన్ బిల్డింగ్‌లో టిక్కెట్ల విక్రయం కోసం బుకింగ్ విండో, ప్లాట్‌ఫాం పై కప్పు, తగినంత వెలుతురు సౌకర్యం, ఫ్యాన్‌లు, నిబంధనలకు అనుగుణంగా వేచియుండు గదులు వంటి ప్రయాణికుల సౌకర్యాలు అందించబడతాయి. కొమురవెల్లిలోని నూతన హాల్ట్ స్టేషన్ ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన రైలు ప్రయాణాన్ని అందిస్తుంది.

ప్రతిపాదిత స్టేషన్ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రైలు వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. యాత్రికులతో పాటు విద్యార్థులు, చిన్న వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులు, రోజువారీ కార్మికులకు కూడా ఈ స్టేషన్ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మనోహరాబాద్ - కొత్తపల్లి నూతన రైలు మార్గం పూర్తిగా ప్రారంభించబడిన తర్వాత, వేములవాడ, భీమేశ్వరాలయం, కొండగట్టు, కోటి లింగేశ్వర స్వామి దేవాలయం మొదలైన ముఖ్యమైన యాత్రా స్థలాలను కలుపుతుంది. ఈ స్టేషన్ ప్రాంతంలోని ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.

Next Story