Video: ప్రైవేటు కొలువులకు పోటెత్తిన నిరుద్యోగులు..తీవ్ర తోపులాట
వరంగల్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
By Knakam Karthik
Video: ప్రైవేటు కొలువులకు పోటెత్తిన నిరుద్యోగులు..తీవ్ర తోపులాట
వరంగల్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాలులో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ ఉద్యోగ మేళాను ప్రారంభించారు. యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగార్థులు హాలు లోపలకి వెళ్లే క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
యువత భారీగా తరలి రావడంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గేట్ తీయగానే నిరుద్యోగులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురు నిరుద్యోగ మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొండా సురేఖ జాబ్ మేళాను ప్రారంభించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరిగింది.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఉద్యోగ మేళాలో 60 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం అందరికీ రావడం కష్టమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.