సాయం చేయ‌బోయి.. ప్రాణాలను కోల్పోయారు

Two Members of SCCL rescue team died in Dahegaon.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 12:46 PM IST
సాయం చేయ‌బోయి.. ప్రాణాలను కోల్పోయారు

భారీ వ‌ర్షాల కార‌ణంగా వాగులు, వంక‌లు పొంగి ప్ర‌వహిస్తున్నాయి. ఫ‌లితంగా చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ గ‌ర్భిణికి పురిటి నొప్పులు మొద‌లు అయ్యాయి. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. అయితే వాగు ఉద్దృతి కార‌ణంగా వారి ప్ర‌య‌త్నాలు విఫ‌లం అయ్యాయి. విష‌యం తెలుసుకున్న సింగ‌రేణి రెస్క్యూ టీం అక్క‌డకు చేరుకుంది. గ‌ర్భిణిని వాగుదాటించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. అయితే.. వ‌ర‌ద ఉధృతికి ఇద్ద‌రు రెస్క్యూ సిబ్బంది కొట్టుకుపోయారు. వారి మృత‌దేహాలు నేడు ల‌భ్యం అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళితే.. వట్టివాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెల‌కొంది. దీంతో బుధవారం మధ్యాహ్నం కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్‌ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్‌ దహెగాంకు చేరుకున్నారు.

గణేశ్‌ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్‌ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్‌ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్‌ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. వెంట‌నే మిగిలిన వారు ఉన్న‌తాధికారుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. అదనపు కలెక్టర్‌ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలియగానే శ్రీరాంపూర్‌ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్‌ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు. ఎట్ట‌కేల‌కు ఈ ఉద‌యం వీరి మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. కాగా.. సాయం చేయ‌బోయి ఇద్ద‌రు రెస్కూ టీమ్ స‌భ్యులు మృతి చెందడం అంద‌రిలోనూ విషాదాన్ని నింపాయి.

Next Story