భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో
By అంజి Published on 7 May 2023 11:30 AM ISTభద్రాద్రి కొత్తగూడెంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలో ఆదివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పుట్టపాడు అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చర్ల మండలం పుట్టపాడు వద్ద గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు గ్రేహౌండ్స్ బృందంపై కాల్పులు జరిపారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్‌లో చెర్ల ఎల్‌ఓఎస్ కమాండర్ రాజేష్, చేతన నాట్య మండలి (సీఎన్‌ఎం) కమాండర్ నంద హతమైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుండి ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు డీఆర్‌జీ జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో వాహనం పేల్చివేయడంతో పది మంది పోలీసులు, వారి డ్రైవర్ మరణించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు.