ఆసిఫాబాద్‌లో కలకలం.. ఇద్దరు బాలికలు అదృశ్యం

Two girl students go missing in Asifabad. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది

By అంజి  Published on  12 Feb 2022 1:26 PM IST
ఆసిఫాబాద్‌లో కలకలం.. ఇద్దరు బాలికలు అదృశ్యం

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సిర్పూర్ (టి) మండలం సలుగుపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బెజ్జూరు మండలం సలుగుపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి స్వాతి, దుర్గం మమత అనే విద్యార్థినులు తొమ్మిదో తరగతి విద్యార్థులు అని సిర్పూర్‌(టి) సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఎం రవికుమార్‌ తెలిపారు. సాయంత్రం స్టడీ అవర్స్‌కు హాజరైన స్వాతి, మమతలు రాత్రి కనిపించకుండా పోయారు. ఇద్దరు కలిసి రాత్రి వసతి గృహం నుండి బయటకు వెళ్లినట్లు సమాచారం.

అయితే విద్యార్థినిలు ఎంతకూ వసత గృహానికి తిరిగి రాలేదు. దీంతో సంస్థ ప్రిన్సిపాల్ బాలికల తల్లిదండ్రులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదృశ్యమైన విద్యార్థినిలు ఇంటికి కూడా వెళ్లకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేసు నమోదు చేసి అదృశ్యమైన బాలికల కోసం గాలింపు చేపట్టారు. బాలికల ఆచూకీ కోసం పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తమ బిడ్డలు కనబడకపోయేసరికి విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Next Story