సూర్యాపేట జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు దగ్థం
చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు దగ్థం అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 10:27 AM ISTసూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) సంస్థకి చెందిన రెండు బస్సులు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెలుతుండగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుంపుల గ్రామ శివారు పరిధిలోకి రాగానే ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణీకులను మరో బస్సులో గమ్యస్థానానికి తరలించారు. ఆగిపోయిన బస్సును రిపేర్ చేసేందుకు మరో బస్సులో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
బస్సులు ఒకదాని వెనుకాల మరొకటి నిలిపి ఉంచి రిపేర్ చేస్తుండగా.. ఆగిపోయిన బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే వెనకాల ఉంచిన బస్సుకు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో అటుగా వెలుతున్న ప్రయాణీకులు భయబ్రాంతులకు గురి అయ్యారు. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.