మహా శివరాత్రి సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం

TSRTC to run 2427 special buses for Maha Shivratri.మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని భ‌క్తుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Feb 2023 9:42 AM IST
మహా శివరాత్రి సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం

మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని భ‌క్తుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. శివ‌రాత్రి రోజున భ‌క్తులు ఉద‌యం నుంచి ఉప‌వాస దీక్ష‌లు చేప‌ట్టి సాయంత్రం శివ‌య్యను ద‌ర్శించుకుంటారు. ఆ ప‌ర‌మ శివుడిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఉప‌వాస దీక్ష‌ల‌ను విడుస్తారు. కొంద‌రు భ‌క్తులు శివాల‌యంలోనే జాగార‌ణ చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఆ రోజున ప్ర‌ముఖ శైవ‌క్షేత్రాల‌న్నీ భ‌క్తుల‌తో నిండిపోతాయి.

భ‌క్తుల‌కు తాము ఉన్న ప్రాంతాల నుంచి ప్ర‌ముఖ శైవ క్షేత్రాల‌కు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు టీఎస్ ఆర్టీసీ చ‌ర్య‌లు చేప‌ట్టింది. 2,427 ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 బస్సులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడవనున్నాయి. అవ‌స‌రం అయితే మ‌రిన్ని భ‌క్తుల‌ను కూడా న‌డిపేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

శ్రీశైలం పుణ్య‌క్షేత్రానికి వెళ్లే వారి కోసం హైద‌రాబాద్‌లోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్ నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్ర‌త్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. ఇక అద్దె బ‌స్సుల‌పై 10 శాతం రాయితీని కూడా ఇస్తున్నారు. భ‌క్తులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవాల‌ని టీఎస్ ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌, ఎండీ స‌జ్జ‌నార్ లు సూచించారు.

Next Story