రేపటి నుంచి జేబీఎస్‌ మీదుగా విజయవాడకు బస్సులు

ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

By అంజి  Published on  17 Oct 2023 7:00 AM IST
TSRTC, Hyderabad, Vijayawada, buses

రేపటి నుంచి జేబీఎస్‌ మీదుగా విజయవాడకు బస్సులు

ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి.

అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే చార్జీలుంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించగలరు. ప్రస్తుతం బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సి వచ్చేది.

ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక , హబ్సిగుడ, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోంది.

Next Story