ఏపీకి వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌..!

TSRTC to introduce 10 sleeper buses.తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వెళ్లే వారికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2023 10:24 AM IST
ఏపీకి వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌..!

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వెళ్లే వారికి ఇది శుభ‌వార్తే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ఆర్టీసీ) ప్రైవేటు బ‌స్సుల‌కు ధీటుగా అత్యాధునిక హంగుల‌తో కూడిన స్లీప‌ర్ బ‌స్సులను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి 10 స్లీప‌ర్ బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు పూర్తిస్థాయి స్లీప‌ర్ బ‌స్సులు కాగా.. ఆరు స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్ బ‌స్సులు. వీటిని హైద‌రాబాద్-కాకినాడ‌, హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మ‌ధ్యన న‌డ‌ప‌నున్నారు.

హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాల‌నీ బ‌స్‌స్టాప్ వ‌ద్ద నేటి(బుధ‌వారం) సాయంత్రం 4 గంట‌ల‌కు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ లు జెండా ఊపి ఈ బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్నారు.

బ‌స్సుల వేళ‌లు

- హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలు దేరుతాయి. కాకినాడలో రాత్రి 7.15, 7.45 గంటలకు తిరిగి బయలుదేరుతాయి.

- విజయవాడ వైపు వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతి రోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరుతాయి.

Next Story