ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. అద‌న‌పు ఛార్జీల్లేకుండా ప్ర‌త్యేక బ‌స్సులు

TSRTC runs Over 4000 special buses for Sankranthi without extra charges.ప్ర‌యాణీకుల‌కు తెలంగాణ రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 5:38 AM GMT
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. అద‌న‌పు ఛార్జీల్లేకుండా ప్ర‌త్యేక బ‌స్సులు

ప్ర‌యాణీకుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లేవారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల‌కు టీఎస్ఆర్టీసీ 4,322 ప్రత్యేక బస్సులను న‌డుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 3,400, జేబీఎస్ నుంచి 1,200 రెగ్యుల‌ర్ బ‌స్సుల‌కు తోడు ఈ బ‌స్సుల‌ను నడుతున్న‌ట్లు తెలిపింది. కాగా.. పండుగ సంద‌ర్భంగా న‌డిపించే ప్ర‌త్యేక బ‌స్సుల్లో ఎటువంటి అద‌న‌పు ఛార్జీల‌ను వ‌సూలు చేయ‌డం లేద‌ని ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు.

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల‌కు 3,338, ఏపీలోని ప‌లు ప్రాంతాల‌కు 984 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. బ‌స్సుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి 200 మంది ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించిన‌ట్లు చెప్పారు. ప్ర‌జలంద‌రూ ఈ వెసులుబాటుకు ఉప‌యోగించుకోవాల‌ని కోరారు. బ‌స్సుల గురించి స‌మాచారం కోసం ఎంజీబీఎస్‌కి 9959226257, జేబీఎస్‌కి 9959226246 నెంబ‌ర్ల‌కు ఫోన్ చేయొచ్చున‌ని తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తుగా టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సంప్రదించాలని సూచించారు.

హైద‌రాబాద్ మ‌హాత్మాగాంధీ బ‌స్ స్టేష‌న్‌(ఎంజీబీఎస్‌), జూబ్లీ బ‌స్ స్టేష‌న్‌, సీబీఎస్‌, ఉప్ప‌ల్ క్రాస్ రోడ్‌, ఎల్‌బీనగ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్‌, ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్‌న‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ పాయింట్ల‌తో పాటు జంట న‌గ‌రాల్లోని వివిధ కాల‌నీల్లో నివ‌సించే వారికి స‌మీపంలోని ముఖ్య‌మైన పాయింట్ల నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి.

ఏపీకి ప్రత్యేక సర్వీసులు..

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు.. హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు న‌డుస్తున్నాయి.

Next Story
Share it